అసెంబ్లీలో నోరు జారిన 'రోజా'

By సుభాష్  Published on  17 Dec 2019 9:29 AM GMT
అసెంబ్లీలో నోరు జారిన రోజా

అసెంబ్లీ సాక్షిగా నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి నోరు జారారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య రచ్చరచ్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా నిన్న జరిగిన సమావేశాల్లో నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ప్రస్తుతం ఆమె చంద్రబాబుపై చేసిన కామెంట్స్ ఫుల్‌గా ట్రోల్ అవుతున్నాయి. మాజీ ముఖ్మంత్రి చంద్రబాబును ‘ముఖ్యమంత్రి’ అని రోజా సంబోధించడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిసిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా.. అసెంబ్లీ సమావేశాల్లో.. మద్యపాన నిషేదంపై చర్చపై ఆమె మాట్లాడిన సందర్భంలో.. ఒక పక్క జగన్‌ని పొగుడుతూనే.. మరోపక్క చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.

రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రంలోని ప్రతీ మహిళ అభినందింస్తోందని అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని పనులను జగన్‌ చేసి చూపిస్తున్నాడని అన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా రూపు మాపేందుకు జగన్‌ కృషి చేస్తున్నారని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి గాలికొదిలేశారని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్‌ హయంలో రాష్ట్రంలో మద్యం ఏరులైపారిందని, దీంతో ఎంతోమంది మహిళలు రోడ్డున పడ్డారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని.. ఆయన ఎక్కడుంటే అక్కడ కరువు ప్రత్యక్షమవుతుందంటూ ఆమె సెటైర్లు విసిరారు. ‘గతంలో కృష్ణానదిలో వరద బదులు.. ‘మద్యం’ ఏరులై పారిందని, దీనిపై మాట్లాడటానికి ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి లేరని.. దీనిపై సమాధానం చెప్పలేరు కాబట్టే పారిపోయారని’ ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం సారీ.. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు గారు పారిపోయారని అంటూ చెప్పుకొచ్చారు.

Next Story