ప్రజలు నిద్రపోయే వరకు మాట్లాడాలనే చంద్రబాబు మైకు వదలడం లేదు: జగన్‌

By సుభాష్  Published on  20 Jan 2020 4:22 PM GMT
ప్రజలు నిద్రపోయే వరకు మాట్లాడాలనే చంద్రబాబు మైకు వదలడం లేదు: జగన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభలో వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. సభలో చంద్రబాబు అబద్దాలు చెబుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం జరిగిన సమావేశంలో వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు దాదాపు 50 నిమిషాల పాటు మాట్లాడారని, అసలు విషయాన్ని పక్కనబెట్టి పనికి రాని విషయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 21 మంది టీడీపీ సభ్యుల్లో ఐదుగురు మాట్లాడితే 150 మంది ఉన్న తమ సభ్యుల్లో కేవలం ఐదుగురు మాత్రమే సభలో మాట్లాడారని జగన్‌ గుర్తు చేశారు. ప్రజలు నిద్రపోయే వరకు మాట్లాడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు మైకును వదలడం లేదని ఎద్దేవా చేశారు.

గంటన్నర పాటు మాట్లాడిన చంద్రబాబు అంతా అబద్దం మాట్లాడారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, చంద్రబాబు తప్పిదం వల్ల హైదరాబాద్‌ను వదులుకున్నామన్నారు. టీడీపీ వాళ్లకు అమరావతిపైనా, రాష్ట్ర ప్రజలపైనా ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. సభలోటీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలంతా గమనిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకృతమైతే నష్టపోతారని గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందని జగన్‌ గుర్తు చేశారు. కమిటీ సిఫార్సులను చంద్రబాబు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాజధాని భూములను లాక్కున్న చంద్రబాబు సభలో పెద్దగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిలదేన్నారు.

Next Story