అన‌సూయ క్రేజ్ ఈమెకెప్పుడు?

By సుభాష్  Published on  10 Sep 2020 6:21 AM GMT
అన‌సూయ క్రేజ్ ఈమెకెప్పుడు?

అన‌సూయ బుల్లితెర‌లో అరంగేట్రం చేసే స‌మ‌యానికే ఆమెకు పెళ్ల‌యింది. పిల్ల‌లున్నారు. ఐతేనేం జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌గా గ్లామ‌ర్ విందు చేస్తూ, త‌న‌దైన చ‌లాకీ త‌నం చూపిస్తూ ట్రెండ్ సెట్ చేసిందామె. ఆ త‌ర్వాత చాలామంది యాంక‌ర్లు అన‌సూయ బాట‌లో న‌డిచారు. అప్ప‌టికే సినిమాల్లో, టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టించిన ర‌ష్మి గౌత‌మ్ కూడా ఇదే బాట ప‌ట్టింది. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోతో అన‌సూయ‌ను మించి గ్లామ‌ర్ ఒల‌క‌బోసింది. ఫేమ్ సంపాదించింది. కాస్త అటు ఇటుగా అన‌సూయ‌, ర‌ష్మి ఇద్ద‌రూ సినిమాల్లో మెరిసే ప్ర‌య‌త్నం చేశారు. అన‌సూయ బుల్లితెర‌పై త‌న‌కున్న ఇమేజ్‌కు భిన్నంగా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ వైపు అడుగులేస్తే.. ర‌ష్మి మాత్రం గ్లామ‌ర్ పాత్ర‌ల వైపు మ‌ళ్లింది. క‌ట్ చేస్తే కొంత కాలానికి ర‌ష్మికి అవ‌కాశాలు అడుగంటిపోయాయి. అన‌సూయ మాత్రం మంచి క్రేజ్‌తో కొన‌సాగుతోంది.

ఒక ద‌శ‌లో ర‌ష్మికి సినిమా అవ‌కాశాలు ఆగిపోయిన‌ట్లే క‌నిపించింది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఆమె.. పేల‌వ‌మైన సినిమాలు చేసి పేరు చెడ‌గొట్టుకుంది. ఈ మ‌ధ్య జ‌బ‌ర్ద‌స్త్, మ‌రికొన్ని టీవీ కార్య‌క్ర‌మాల్లో మిన‌హా ర‌ష్మి క‌నిపించ‌డం లేదు. ఐతే చాలా కాలం త‌ర్వాత కాస్త చెప్పుకోద‌గ్గ సినిమాలో ఆమెకు అవ‌కాశం ద‌క్కింది. నందు హీరోగా ఇటీవ‌లే ప్ర‌క‌టించిన బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో ర‌ష్మినే క‌థానాయిక‌గా. తాజాగా ఆమె ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో ర‌ష్మి చాలా అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ఆస‌క్తిక‌రంగా అనిపించాయి. నందుతో పాటు ర‌ష్మికి కూడా ఇది ట‌ర్నింగ్ పాయింట్ అవుతుందేమో అనిపిస్తోంది. మ‌రి అన‌సూయ‌లా ర‌ష్మి కూడా సినిమాల్లో మెరిసిపోయే రోజులు ఈ చిత్రంతో అయినా వ‌స్తాయేమో చూడాలి.

Next Story