క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ముప్పుతో ఇప్ప‌టికే ప‌లు క్రీడాటోర్నీలు ర‌ద్దు కాగా.. మ‌రికొన్ని వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దేశ వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా క్రీడాకారులంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. ప్ర‌స్తుతం విరుష్క జంట సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. నిత్యావ‌స‌రాలు మిన‌తావ‌న్ని మూసివేయ‌డంతో విరాట్ కోహ్లీకి హెయిర్ స్టెలిస్ట్ ఎవ‌రూ దొర‌క‌డం లేదు. దీంతో అత‌ని భార్య‌, బాలీవుడ్ యాక్ట‌ర్ అనుష్క శ‌ర్మ హెయిర్ స్టెలిస్ట్ అవ‌తారం ఎత్తింది.

ఇంట్లోనే ఉన్న కోహ్లీకి హెయిర్ కట్ చేస్తున్న వీడియోని తాజాగా అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కోహ్లీ కూడా తన కొత్త హెయిర్ స్టయిల్ చాలా బాగుందని కితాబిచ్చాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్ ప్రకటించగానే మద్దతు తెలిపిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో ఈ నెల 14న మూడు వన్డేల సిరీస్ ర‌ద్దైన‌ తర్వాత అనుష్క శర్మతో కలిసి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. దేశ ప్రజలు కూడా ఇంట్లోనే ఉండాలని సూచించాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ వీడియో చివ‌ర్లో హెయిర్ క‌ట్ కు ముందు, త‌ర్వాత కోహ్లీ ఎలా ఉన్నాడో తెలిపే ఫోటోలు ఉన్నాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీ ఏప్రిల్ 15కి వాయిదా పడింది. కానీ.. దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ జరగడంపై సందిగ్ధత నెలకొంది.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.