ఈనెల 21న వలయాకార సూర్యగ్రహణం.. నేరుగా చూడవచ్చా..?

By సుభాష్  Published on  20 Jun 2020 4:33 AM GMT
ఈనెల 21న వలయాకార సూర్యగ్రహణం.. నేరుగా చూడవచ్చా..?

అకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈనెల 21వ తేదీన వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.04 గంటల వరకూ ఈ సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. అయితే పూర్తి గ్రహణం ఉదయం 10.17 గంటల నుంచి మధ్యాహ్నం 2.02 గంటల వరకూ కనిపించనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనార్హం.

వలయాకార సూర్యగ్రహణం అంటే ఏమిటీ..?

చంద్రుడు భూమి నుంచి అత్యంత దూరంలో ఉండే ప్రదేశాన్ని అపోజీగా వ్యహరిస్తుంటారు. అపోజీలో చంద్రుడు ఉన్నప్పుడు, భూమికి సాధారణం కంటే కాస్త చిన్నగా కనిపించనున్నాడు. దీంతో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబింబం మూసినంత మేర దాని చుట్టూ ఉంగరంలా కనిపిస్తుంది దీనిని యాన్యులర్‌ లేదా వలయాకార గ్రహణం కూడా అంటారు. ఈ యాన్యులర్‌ అనే పదం లాటిన్‌లోని యాన్యులస్‌ అనే పదం నుంచి పుట్టింది. యాన్యులస్‌ అంటే ఉంగరం అని అర్థం.

సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది

ఈ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, హిందూ, పసిపిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, అలాగే ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. మిగితా ప్రాంతాల్లో కేవలం పాక్షిక సూర్యగ్రహణం లాగే కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో నేరుగా చూడవచ్చా..

ఇక తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో కూడా ఈ సూర్యగ్రహాన్ని చూసే అవకాశం ఉంది. నేరుగా కాకుండా ప్రత్యేక పరికరాలను ఉపయోగించి చూడవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ సారి వచ్చే గ్రహణం తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా కనిపించదు. ఉత్తర భారత దేశంలో మాత్రమే సంపూర్ణంగా కనిపించనుంది. మిధున రాశివారు ఈ గ్రహనం చూడవద్దని పండితులు సూచిస్తున్నారు. అలాగే అరుద్ర, మృగశిర, పునర్వసు నక్షత్రాల వారు కూడా దీనిని చూడకపోవడమే మంచిదంటున్నారు.

తెలంగాణలో..

తెలంగాణలో ఈ సూర్యగ్రహణం ఉదయం 10.14కు మొదలై ఉదయం 11.55కు చందమామ భూమి, సూర్యుడి మధ్యకు వస్తుంది. ఆ తర్వాత గ్రహణం విడిపోతూ మధ్యాహ్నం 1.44 గంటలకు పూర్తిగా తొలగిపోతుంది. మొత్తం మూడున్నర గంటల పాటు ఈ సూర్యగ్రహణం ప్రక్రియ కొనసాగుతుంది.

ఏపీలో..

ఏపీలో ఉదయం 10.23కు మొదలై మధ్యాహ్నం 12.05కు చందమామా భూమి, సూర్యుడి మధ్యకు వస్తుంది. ఆ తర్వాత విడిపోతూ మధ్యాహ్నం 1.51కి పూర్తిగా తొలగిపోతుంది. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ సూర్యగ్రహణం ఉంటుంది.

ఈ సూర్యగ్రహాన్ని చూడాలంటే..

ఈ సూర్యగ్రహణాన్ని చూడాలంటే సోలార్‌ ఎక్లిప్స్‌ గ్లాసెస్‌ తో మాత్రమే చూడాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. దీనిని మొబైల్‌తో ఫోటోలు తీయవద్దని చెబుతున్నారు. సూర్యగ్రహణాన్ని ఫోటోలు, వీడియోలు తీయాలంటే ప్రత్యేక సోలార్‌ ఫిల్టర్‌ అవసరమని నాసా చెబుతోంది.

సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి..

21న ఆదివారం ఉదయం 8 గంటలలోపు స్నానాలు పూర్తి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే 9.15 గంటల లోపు టిఫిన్లు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత గాయత్రి మంత్రం, జపాలు చేసుకోవచ్చు. గ్రహణం తర్వాత ఇల్లును శుభ్రంగా కడుక్కొని మళ్లీ తలస్నానం చేసి పూజలు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

Next Story