వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 15 March 2024 2:47 PM ISTవైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భావోద్వేగానికి గురి అయ్యారు. చిన్నాన్న వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా చంపారంటూ కామెంట్స్ చేశారు. హత్య జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దోషులను పట్టుకోలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. బాబయ్ శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయనీ అన్నారు. దారణంగా హతమార్చారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నాన్న మరణంతో చిన్నమ్మ, సునీత అందరి కంటే ఎక్కువ నష్టపోయారని వైఎస్ షర్మిల చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతను టార్గెట్ చేసి ఎంతో వేధించారని ఆమె ఫైర్ అయ్యారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా.. వారిపైనే ఆరోపణలు చేస్తారా అని షర్మిల ప్రశ్నించారు. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులన రక్షిస్తున్నారంటూ షర్మిల విమర్శలు చేశారు. బంధువలే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని అన్నారు. జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదంటూ షర్మిల నేరుగా విమర్శించారు. అయితే.. వైస్ వారసుడిగా తోబుట్టువులకు ఏం చేశారో జగన్ చెప్పాలంటూ నిలదీశారు.
సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని షర్మిల గుర్తు చేసుకున్నారు. కలిసి చదువుకున్నామని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు వైఎస్ షర్మిల. రాజకీయాల కోసం, అధికారం కోసమో తానీ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు శిక్ష పడాలని ఆమె కోరుకుంటున్నట్లు చెప్పారు.