లడ్డూ వివాదాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి: వైఎస్ షర్మిల
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 11:11 AM GMTతిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఏపీలో ఈ వివాదంపై రాజకీయ పరంగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కీలక కామెంట్స్ చేశారు.
తిరుమల లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖలో బుధవారం వైఎస్ షర్మిల పర్యటించారు. ఎయిర్‌పోర్టు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని గాంధీ జయంతిలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి దీక్షలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై స్పందించారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ముందుగా తామే స్పందించి సీబీఐ విచారణ కోరామని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఈ విషయంపై హోం శాఖ మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు చెప్పారు. ఏపీ గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేశామన్నారు వైఎస్ షర్మిల. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సిట్ దర్యాప్తుపై సంతృప్తిగా లేదన్న విషయాన్ని షర్మిల ప్రస్తావించారు.లడ్డూ వివాదాన్ని రాజకీయ పార్టీలు వాడుకోవడం మానేయాలనీ.. మతం రంగు పూయకండని అన్నారు.