రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది సీఎం జగనే: వైఎస్ షర్మిల
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
By Srikanth Gundamalla
రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది సీఎం జగనే: వైఎస్ షర్మిల
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ పేరు చార్జిషీటులో పెట్టించింది జగనేనని షర్మిల ఆరోపించారు. ప్రస్తుతం అదనపు అడ్వొకేట్ జనరల్ గా ఉన్న పొన్నవోలుతోనే పిటిషన్ వేయించారన్నారు. వాస్తవం ఏంటో చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివేది సీఎం జగన్ మాత్రమే అంటూ షర్మిల విమర్శలు చేశారు. ఆయన మక్కీకి క్కీ చదివి పలుమార్లు విమర్శలకు గురైన విషయాన్ని చెప్పారు. తాను వైఎస్సార్ బిడ్డను అనీ.. తనకు మోకరిల్లే అవసరం లేదన్నారు. తనపై ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తాను పట్టించుకోనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరే అంటూ మండిపడ్డారు. మోదీకి జగన్ దత్తపుత్రుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌రెడ్డితో చెల్లెల్లు ఎవరూ లేరని ఆమె అన్నారు. వైఎస్సార్‌ను తిట్టిన రోజా, రజినీ ఇప్పుడు జగన్‌కు చెల్లెల్లు అయ్యారని అన్నారు. అసెంబ్లీ వేదికగా వైఎస్సార్‌ను తిట్టినవారంతా ఇప్పుడు జగన్‌కు బంధువులుగా మారారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
జాబ్ క్యాలెండర్ విషయంలో యువతను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని షర్మిల ఫైర్ అయ్యారు. ఐదు సంక్రాంతులు వచ్చాయి కానీ.. జాబ్ క్యాలెండర్ రాలేదన్నారు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొని హంగామా చేస్తున్నారంటూ విమర్శించారు. కుంభకర్ణుడు అయినా ఆరు నెలలకు లేస్తారనీ.. జగన్ ప్రభుత్వం మాత్రం మేల్కొనడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పాలనలో రైతులంతా అప్పులపాలు అయ్యారనీ.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారనీ అవన్నీ ఏమయ్యాయనీ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.