వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతారా?: వైఎస్ షర్మిల
ఏపీలో కూటమి ప్రభుత్వం పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 15 Sep 2024 9:37 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సీరియస్ అయ్యారు. పలు ప్రశ్నలను సంధించారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేసి.. వైద్య విద్యను ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే వైద్య విద్య చాలా మందికి అందని ద్రాక్షగా ఉందన్నారు. ఇప్పుడు ప్రయివేట్ పరం చేస్తే వైద్య విద్యను సాధారణ ప్రజలకు మరింత దూరం చేసిన వారు అవుతారని వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యయనం చేయాలని అనుకున్నారని, దీనిపై జరుగుతున్న ప్రచారంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కూటమి సర్కార్ లో భాగస్వామ్య పక్షంగా ఉంది, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైనా పులివెందుల,ఆదోని,మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని, నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేవని మెడికల్ బోర్డుకి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా అని వైఎస్ షర్మిల నిలదీశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారని అన్నారు. మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారని తప్పుబట్టారు. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి, ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు వైఎస్ షర్మిల .