సస్పెన్షన్‌పై సస్పెన్స్!

YCP Silence on MP Gorantla madhav video.హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రాజకీయ పార్టీలు, సోషల్ మీడియాలో

By సునీల్  Published on  6 Aug 2022 11:40 AM IST
సస్పెన్షన్‌పై సస్పెన్స్!

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రాజకీయ పార్టీలు, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. లీకైన వీడియోపై దర్యాప్తు జరిపిన పోలీస్ శాఖ, ఆరా తీసిన ఇంటెలిజెన్స్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. అయితే ఈ వ్యవహారంపై సదరు ఎంపీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల మినహా స్పందించిన వారే లేరు. ఏ చిన్న ఆరోపణ చేసినా, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు స్పందించే వైసీపీ శ్రేణులు మౌనంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అధికార పార్టీలో ఈ సైలెన్స్ చూస్తుంటే చర్యలు తీసుకోకుండా సరిపెట్టేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానిజాలతో నివేదిక

ఎంపీ మాధవ్ ఒక మహిళతో వీడియో కాల్ చేసిన వ్యవహారంలో పోలీస్ వర్గాలు అన్ని కోణాల్లో ఆరా తీశాయి. వీడియో మార్ఫింగ్‌కు ఉన్న అవకాశాలు ఏంటనే విషయంపై పరిశోధించాయి. అలాగే తొలుత ఏ సెల్ ఫోన్ నుంచి ఆ వీడియో ఫార్వార్డ్ అయిందో గుర్తించాయి. వీడియో లీకేజీ వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందా, ఇతర ప్రయోజనాలు ఉన్నాయా అనేది పక్కన పెడితే.. అది వాస్తవమా కాదా అనే విషయంలో నిర్ధారణకు వచ్చాయి. విచారణలో గుర్తించిన నిజానిజాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు అందించారు.

ఒకరితో అయిపోదు..

వీడియో వ్యవహారంలో ప్రభుత్వం కానీ, పార్టీ కానీ చర్యలు తీసుకుంటే ఎంపీ ఒకరితో అయిపోదు. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. వాటిలో ఎస్వీబీసీ చైర్మన్‌గా వ్యవహరించిన పృధ్వీపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. ప్రతి నిత్యం ప్రభుత్వం, పార్టీలను ఎండగడుతున్న మరో ఎంపీ రఘురామపై ఇప్పటి వరకు వేటు వేయలేదు. ఇప్పుడు మాధవ్‌పై అలాంటి నిర్ణయం తీసుకుంటే, మరో రఘురామలా మారతారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే గతంలో లీకైన ఆడియోలు, ఫొటోల్లో ఉన్న ప్రజాప్రతినిధులపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు తెరపైకి వస్తాయి.

సస్పెన్షన్ కన్నా సైలెన్స్ మేలు..

గతంలో లీకైన ఆడియో, వీడియో వ్యవహారాల్లో రాష్ట్రానికి సంబంధించిన వారు కావడంతో ప్రచారం పరిమితంగా జరిగింది. తాజా వీడియో ఎంపీకి సంబంధించింది కావడంతో జాతీయ స్థాయిలో అల్లరవుతోంది. అసలే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయం. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఉంది. ఇలాంటప్పుడు ప్రభుత్వం కానీ, పార్టీ కానీ ఏ క్రమశిక్షణ చర్య తీసుకున్నా దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతుంది. ఇప్పటికే హిందూపురం పార్లమెంట్ స్థానంలో నిర్వహించిన సర్వేల్లో ఆ ఎంపీకి వ్యతిరేకంగా నివేదికలు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనుక వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది ఉండదంటున్నాయి. అలాంటప్పుడు సస్పెన్షన్ ద్వారా చాన్స్ ఇవ్వడం కన్నా సైలెన్స్‌గా ఉండటమే మంచిదని కీలక నేతల సూచనగా తెలుస్తోంది.

Next Story