ఏసీలు వాడితే బిల్లు ఎక్కువ రాదా? విద్యుత్‌ చార్జీలపై ఎమ్మెల్యే కామెంట్స్

శ్రీశైలం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసీలు, కూలర్లు వాడితే కరెంటు బిల్లులు ఎక్కువగా రావా? అని అన్నారు.

By Srikanth Gundamalla  Published on  16 July 2023 6:55 AM GMT
YCP, MLA Silpa Chakrapani Reddy, Comments, Current Charges,

ఏసీలు వాడితే బిల్లు ఎక్కువ రాదా? విద్యుత్‌ చార్జీలపై ఎమ్మెల్యే కామెంట్స్

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు జనాల మధ్యకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జగనన్న సురక్ష పసేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తోందని ఆవేదన వ్యక్తం చేయగా.. దానికి ఎమ్మెల్యే వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఏసీలు, కూలర్లు వాడితే కరెంటు బిల్లులు ఎక్కువగా రావా? అంటూ ఎదురుగా ఆమెనే ప్రశ్నించారు. ఎమ్మెల్యే కామెంట్స్‌తో కార్యక్రమానికి వచ్చిన జనంతో పాటు ఇతర లోకల్ నాయకులు కూడా షాక్‌ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బండి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఈర్నపాడులో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. జగన్‌ సురక్ష కార్యక్రమానికి శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. ఒక మహిళ లేచి మధ్యలో మాట్లాడింది. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెరిగిపోయాని.. తన ఇంటికి గతంలో రూ.200 లోపు వచ్చే బిల్లు ఇప్పుడు రూ.600 నుంచి రూ.800 వరకు వస్తోందని.. బిల్లులు కట్టడమే భారంగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే.. సదురు మహిళ మాట్లాడిన మాటలపై ఎమ్మెల్యే చిరాకుగా స్పందించారు.

సీఎం జగన్‌ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. అందులో భాగంగానే ఏసీలు, కూలర్లు కొంటున్నారు.. మరి వాటిని వాడటం వల్లే విద్యుత్‌ బిల్లు ఎక్కువ వస్తోందని జవాబిచ్చారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. కాగా.. తమ ఇంట్లో అలాంటి వస్తువులేవీ లేవని.. అయినా బిల్లు ఎందుకు ఎక్కువగా వస్తోందని అందరి ముందే ఎమ్మెల్యేను నిలదీసింది. దాంతో.. మధ్యలోనే కలుగ జేసుకుని మహిళను మాట్లాడనివ్వకుండా ఎమ్మెల్యే చిరాకు పడ్డారు. ఎమ్మెల్యే తీరుని చూసిన కార్యక్రమానికి హాజరైన జనంతో పాటు ఇతర స్థానిక నాయకులు కూడా షాక్‌ అయ్యారు.

Next Story