రేపు విజయవాడలో వైసీపీ పదాధికారుల సమావేశం.. భారీ ఏర్పాట్లు
రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ పదాధికారుల సమావేశం జరగనుంది.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 9:13 AM GMTరేపు విజయవాడలో వైసీపీ పదాధికారుల సమావేశం.. భారీ ఏర్పాట్లు
అక్టోబర్ 9న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్‌ఆర్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు. 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే చాన్స్ ఉందని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే.. సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో ఏర్పాట్లను మంత్రి జోగి రమేశ్‌తో పాటు.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
ఏపీలో సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు సీఎంగా వైఎస్ జగన్ ఉడటం చారిత్రాత్మక అవసరం అని అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలు చేయడం సీఎం జగన్‌కే చెల్లిందని అన్నారు జోగి రమేశ్. దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీలో సీఎం జగన్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం అమలు చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయమని పేర్కొన్నారు. పేదవాడికి ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండాలనేది జగన్ లక్ష్యమని మంత్రి జోగి రమేశ్ అన్నారు. అయితే.. జైల్లో ఉన్న అవినీతిపరులను ప్రజలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు గురించి విమర్శలు చేశారు. తమకు ఎవరు న్యాయం చేయగలరో ప్రజలకు తెలుసని.. గత ఎన్నికల్లో ఫలితాలే మరోసారి రిపీట్ కానున్నాయని మంత్రి జోగి రమేశ్ అన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రేపు వైసీపీ పదాధికారుల సమావేశానికి 8వేలకు పైగా ప్రతినిధులు హాజరువుతారని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో రేపటి సమావేశానికి ప్రాముఖ్యత నెలకొందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ వైద్యం అందుతోందని చెప్పుకొచ్చారు. రేపటి సమావేశంలో అనేక కీలక అంశాలపై సీఎం జగన్ ప్రసంగిస్తారని సజ్జల చెప్పారు. సీఎం జగన్ పాలనలో సమగ్రాభివృద్ధితో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. ప్రజలు సురక్షితంగా ఉండాలనే మరోసారి జగనే సీఎం కావాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో టీడీపీ ఉందని విమర్శించారు సజ్జల. చంద్రబాబు అవినీతికి పాల్పడి అరెస్ట్ అయితే.. కొందరు కావాలనే హడావుడి చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.