సలహాలు సినీ ఇండస్ట్రీలో వారికి ఇవ్వాలి.. చిరంజీవికి వైసీపీ నేతల కౌంటర్
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 4:35 PM ISTసలహాలు సినీ ఇండస్ట్రీలో వారికి ఇవ్వాలి.. చిరంజీవికి వైసీపీ నేతల కౌంటర్
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. 'వాల్తేరు వీరయ్య' సినిమా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా స్టార్ చిరంజీవి రాజకీయాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. మీలాంటి వారు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని సూచించారు చిరు. పేదవారి కడుపు నింపే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. అలా చేస్తే అందరూ మీకే తలవంచి నమస్కారాలు చేస్తారని అన్నారు. అంతేకానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడతారేంటని మెగాస్టార్ చిరంజీవి చురకలు అంటించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు స్పందించారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని చెప్పారు. చిరంజీవి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తోందని తెలిపారు. తాము వారాహి యాత్రను అడ్డుకోవడం లేదని.. యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు పుంగనూరు మాదిరిగా విధ్వంసం చేయాలని చూస్తున్నారా అంటూ జనసేన నేతలను మంత్రి బొత్స ప్రశ్నించారు.
ప్రభుత్వాలు ఎలా ఉండాలో చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు ఉచితంగా సలహాలు ఇస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రభుత్వానికి కాదు.. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి కూడా సలహాలు ఇస్తే బాగుంటుందని అన్నారు. డ్యాన్స్‌లు, ఫైట్లు, యాక్షన్ గురించి చూసుకోవాలని.. వేరే విషయాలు మనకెందుకు అని చెబితే బాగండని అన్నారు కొడాలి నాని. పవన్ రెండు చోట్ల పోటీ చేసి.. నాలుగు చోట్ల ఓడిపోతారని విమర్శించారు. జనసేన పార్టీ జనసున్నా పార్టీ అంటూ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు చేశారు.