ఎంపీ అవినాశ్ నేరస్థుడు కాదు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు: సజ్జల
వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఆయన హైదరాబాదులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి
By M.S.R Published on 19 May 2023 7:30 PM ISTఎంపీ అవినాశ్ నేరస్థుడు కాదు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు: సజ్జల
వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఆయన హైదరాబాదులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తల్లికి అనారోగ్యంగా ఉందంటూ పులివెందుల పయనమయ్యారు. అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ అంబులెన్స్ తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్ కి ఎదురైంది. ఆయన తన కాన్వాయ్ ని ఆపి, అంబులెన్స్ లో ఉన్న తల్లిని పరామర్శించారు. అనంతరం తన కాన్వాయ్ మళ్లీ వెనక్కి మళ్లించారు. ప్రస్తుతం అంబులెన్స్ సహా ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్ హైదరాబాద్ వస్తోంది.
సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అవినాశ్ నేరస్థుడు కాదని, ఎక్కడికీ పోవడం లేదని, తప్పించుకోవాల్సిన అవసరం లేదని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ రోజు సీబీఐ విచారణకు ఆయన హాజరుకాకపోవడంపై కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. గతంలో సీబీఐ నోటీసులిచ్చిన ప్రతిసారి అవినాశ్ హాజరయ్యారని గుర్తుచేశారు. విచారణకు హాజరయ్యేందుకే అవినాశ్ హైదరాబాద్ కు వచ్చారని, తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి అవినాశ్ ముందే సమాచారం ఇచ్చివుంటారని సజ్జల అభిప్రాయపడ్డారు. సీబీఐ పిలిచాక ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్లక తప్పదన్నారు.