మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు చుక్కెదురు అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  15 Sep 2024 10:15 AM GMT
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు చుక్కెదురు అయ్యింది. ఆయన్ని న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వచ్చే 17వ తేదీ వరకు మంగళిగిరి పోలీసులు ఆయన్ని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించనున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌ను ప్రశ్నించనున్నారు. రెండ్రోజుల పాటు సాగనున్న ఈ విచారణలో కీలక విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు టీడీపీ వర్గీయులు. కాగా.. నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఆయన్ని జైలు నుంచి పోలీసులు మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించనున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి విషయంపై విచారణకు పోలీసులతో సహకరించాలని నందిగం సురేశ్‌కు న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఈ విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయడం, దూషించడం, భయపెట్టడం వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

అయితే ఈ విచారణకు తమ న్యాయవాదులను కూడా అనుమతించాలని నందిగం సురేష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేస్తే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది. మరోవైపు నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేతలు, ఎమ్మెల్సీలు శనివారం పోలీసు విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసుల్లో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేశ్‌, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌, న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌ తమ పాస్‌పోర్టులను 48 గంటల్లో దర్యాప్తు అధికారులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, వైసీపీ నేతల నుంచి విచారణకు ఎలాంటి సహకారం లభించలేదని సమాచారం. మంగళగిరి సర్కిల్‌ కార్యాలయంలో శనివారం రాత్రి వరకూ విచారణ కొనసాగింది.

Next Story