తిరుమల వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు: జగన్
వెంకటేశ్వరస్వామి వ్యవస్థను రోడ్డుమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Sep 2024 10:35 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారనే వార్తలు సంచలనం అయ్యాయి. దీనిపై రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు రేగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలోనే ఇది జరిగిందని అన్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ ఈ అంశంపై స్పందించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంకటేశ్వరస్వామి వ్యవస్థను రోడ్డుమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నారు. దేవాలయ పరువును బజారుకీడ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేవలం ప్రజల మనస్సులను డైవర్ట్ చేసేందుకు, లడ్డు కాంట్రవర్షీ తెరమీదకు తెచ్చారన్నారు. దేవుడిని కూడా రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఎనిమల్ ఫ్యాట్ వాడారని, భక్తులు తిన్నారని కూడా చంద్రబాబు చేయడం కూడా ఎంత వరకు కరెక్ట్ అని వైఎస్ జగన్ అన్నారు. దేవుడికి మంచి చేయడం ఎలా అనే మైండ్ సెట్‌తో ఉన్నవారే టీటీడీలో ఉన్నారని చెప్పారు. మన సంస్థలను మనమే తక్కువ చేసుకుంటున్నామని అన్నారు జగన్. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారనీ.. జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
బయట ప్రపంచానికి తప్పుడు మెసేజ్‌ను పంపుతున్నామని జగన్ అన్నారు. బురద వేయాలనే దుర్బుద్ధితోనే చేస్తున్నారనీ.. చంద్రబాబు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమన్నారు. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయన్నారు. నెయ్యి తయారీకి కొండపై ప్రత్యేక గోశాలను పెట్టామని చెప్పారు. కార్మికులను క్రమబద్దీకరించామన్నారు. చంద్రబాబు దేవాలయాలను కూల్చేశారని జగన్ గుర్తు చేశారు. కానీ.. తాము ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేశామన్నారు. ఇదే అంశంపై ప్రధాని, సీజేఐ కూడా లేఖ రాస్తానని అన్నారు జగన్. దురుద్దేశ్యంతో తిరుమల ఆలయాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని లేఖల్లో వివరిస్తానని మాజీ సీఎం జగన్ చెప్పారు.