నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది: జగన్
నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 8:30 PM ISTవైసీపీ అనుబంధ విభాగాలతో జగన్ సమావేశం అయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక కామెంట్స్ చేశారు. నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
విజయవాడ వరద బాధితులకు ఎన్యుమరేషన్‌ను సరిగ్గా చేయలేదని అన్నారు. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా... సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదంటూ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారు. అబద్దాలను నమ్మి ఓటేశామనీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యతిరేకత మొదలైందని చెప్పారు. స్కూళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయని జగన్ అన్నారు. మూడు నెలల్లో లక్షన్నర ఫించన్లు తగ్గించారంటూ ఆరోపించారు.
అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జగన్ ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ లేదు... డోర్ డెలివరీ గాలికెగిరిపోయిందని వ్యాఖ్యానించారు. చివరికి విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయలేని దుస్ధితిలో ఉన్నారంటూ విమర్శలు చేశారు. నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత తారాస్ధాయికి వెళ్లడంతో, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని చెప్పారు. అలాగే తిరుపతి లడ్డూ అని ఒకసారి, డిక్లరేషన్ అని మరోసారి డైవర్షన్ చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు.