వైసీపీకి షాక్.. టీడీపీలో చేరుతానని యార్లగడ్డ ప్రకటన

గన్నవరం వైసీపీలో మూడేళ్లుగా కొనసాగుతున్న పోరు మరో మలుపు తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  18 Aug 2023 5:10 PM IST
Yarlagadda, goodbye YCP, TDP ,

 వైసీపీకి షాక్.. టీడీపీలో చేరుతానని యార్లగడ్డ ప్రకటన

గన్నవరం వైసీపీలో మూడేళ్లుగా కొనసాగుతున్న పోరు మరో మలుపు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా సీఎం జగన్‌ మాత్రం వంశీవైపే మొగ్గు చూపడంతో యార్లగడ్డ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, అనుచరులతో యార్లగడ్డ సమావేశం అయ్యారు. వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. త్వరలోనే చంద్రబాబుని కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు యార్లగడ్డ.

అనుచరులతో భేటీ అయిన యార్లగడ్డ వెంకట్రావు ముందు వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. నాయకులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీ చేశానని గుర్తు చేశారు. అవమానాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు అయ్యిందని అన్నారు యార్లగడ్డ. ప్రభుత్వం వచ్చినా తమపై కేసులు కొనసాగాయని యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. యార్లగడ్డను ఎక్కడైనా సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదన్నారు. గతంలో గన్నవరంలో వైసీపీ గెలవడమే ధ్యేయంగా పనిచేశానని చెప్పారు. టికెట్‌ ఇవ్వాలని మాత్రమే సీఎంను అడిగానని.. పార్టీ పెద్దలకు ఏమీ అర్థమైందో తెలియదని యార్లగడ్డ అన్నారు. ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల చెప్పడం తనకు చాలా బాధ,ఆవేదన కలిగించిందన్నారు యార్లగడ్డ. వైఎస్‌ఆర్‌ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని అభిప్రాయపడ్డారు.

2005లోనే అమెరికా గ్రీన్‌ కార్డు వచ్చినా రాజకీయాలపై ఇష్టంతో గన్నవరం వచ్చానని యార్లగడ్డ అన్నారు. పాదయాత్రలో ఇంటింటికీ తిరిగానని అన్నారు. తాను గన్నవరం నుంచి ఓడినా.. కార్యకర్తలు తనతోనే ఉన్నారని చెప్పారు. తనతో పనిచేసిన వారికి పదవులు ఇవ్వలేదనీ అన్నారు. వైసీపీ కోసమే పని చేశా కానీ.. ఉంటే ఉండు పోతే పో అనే పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు యార్లగడ్డ. ఇప్పటి వరకు చంద్రబాబు, లోకేశ్, దేవినేని తాను కలవలేదన్నారు. కానీ.. తనకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వనందుకు ధన్యవావాలు చెప్పారు. టీడీపీ నుంచి తనకు గన్నవరం టికెట్‌ ఇస్తే.. వైసీపీపై గెలిచి కానుకగా ఇస్తానన్నారు. మళ్లీ జగన్‌ను అసెంబ్లీలోనే ఎమ్మెల్యేగా కలుస్తానని అన్నారు యార్లగడ్డ.

Next Story