Vijayawada: రూ.30లక్షలు ఇస్తామని చెప్పి.. కిడ్నీ కొట్టేశారు
విజయవాడలో మరోసారి కిడ్నీ రాకెట్ మోసాలు బయటపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 9 July 2024 6:35 AM ISTVijayawada: రూ.30లక్షలు ఇస్తామని చెప్పి.. కిడ్నీ కొట్టేశారు
విజయవాడలో మరోసారి కిడ్నీ రాకెట్ మోసాలు బయటపడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. అయితే.. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన బాధితుడు మధుబాబు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేశాడు.
ఈ మేరకు మాట్లాడిన మధుబాబు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. తనకు వివాహం అయ్యిందనీ.. ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. వివిధ వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పాడు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా చేసిన అప్పులతో సతమతం అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో బాషా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు కిడ్నీ ఇస్తే డబ్బులు ఇప్పిస్తానని చెప్పడంతో ఒప్పుకున్నట్లు చెప్పాడు. అప్పులు తీర్చడంతో పాటురూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మించాడని బాధితుడు మధుబాబు చెప్పాడు. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి.. రోగికి అన్ని సరిపోయేలా ఉండటంతో ముందుగా రూ.59వేలు ఇచ్చారని మధుబాబు చెప్పాడు.
కిడ్నీ ఇవ్వాలంటే సమీప బంధువుకు మాత్రమే ఇవ్వగలమని చెప్పడంతో.. ఆధార్ కార్డులో మార్పులు కూడా చేశానని మధు చెప్పాడు. నకిలీ సర్టిఫికెట్లు వారే సృష్టించారని పేర్కొన్నాడు. గత నెల 15న ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నట్లు చెప్పాడు. స్పృహ వచ్చాక చూస్తే కుడివైపున కిడ్నీని వెంకటస్వామి అనే వ్యక్తికి మార్చారని మధుబాబు చెప్పాడు. అయితే. ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు కాకుండా.. రూ.50వేలు మాత్రమే ఇచ్చారని వాపోయాడు. ఇదేంటని అడిగితే రోగి బంధువు, మద్యవర్తి.. డాక్టర్ శరత్‌బాబు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రాణం తీస్తామంటూ బెదిరించారని బాధితుడు వాపోయాడు. కాగా.. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే మూత్రపిండాల మార్పిడి చికిత్స నిర్వహించామని శరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్టర్ జి.శరత్‌బాబు వెల్లడించారు. కిడ్నీ విక్రయాలపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని శరత్‌బాబు పేర్కొన్నారు.