విజయవాడ ఇంతలా వరదలో మునగడానికి కారణమిదే..!
విజయవాడలో గతంలో ఎన్నడూ చూడని వరద పరిస్థితులు ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Sep 2024 2:41 AM GMTవిజయవాడలో గతంలో ఎన్నడూ చూడని వరద పరిస్థితులు ఉన్నాయి. ఇళ్లన్నీ వరద నీటిలో ముగిపోయాయి. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి బెజవాడ నగరం మొత్తం వణికిపోయింది. అయితే.. ఎన్నడూ లేనంతా ఇప్పుడే విజయవాడ ఎందుకు వరదలతో మునిగిపోయిందని అందరూ ఆరా తీస్తున్నారు.
విజయవాడ నగరం ఇటు బుడమేరు, అటు కృష్ణా నది మధ్యలో ఉంటుంది. దాంతో.. వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గత మూడ్రోజులు బెజవాడ ప్రజలు నరకం చూస్తున్నారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్.. ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటల పాటు పవర్ కట్ అవ్వడంతో సెల్‌ఫోన్ టవర్స్ పనిచేయలేదు. మొత్తంగా చెప్పాలంటే విజయవాడలోని పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవారిని భవనాల పైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ అక్కడ పడవలతోనే ఆహారం సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు.
విజయవాడ మునగడానికి బుడమేరు వాగు కారణమా?
ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గట్ల నుంచి వర్షం నీటి ద్వారా బుడమేరు వాగు ప్రవహిస్తుంది. గత శతాబ్దంలో ఎప్పుడూ చూడనంత వరదను ఈ సారి చూశారు విజయవాడ ప్రజలు. క్రమేణా ఇళ్లు పెరిగిపోవడంతో కాలనీలకు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళుతుంది. దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణా నదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కు వస్తోంది. దీంతో ఆ ప్రవాహమంతా.. గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దాంతో అజిత్ సింగ్ నగర్, ఆటోనగర్ వరదలో చిక్కుకున్నాయి. సింగ్ నగర్, నున్న, గన్నవరం.. ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. చివరకు విజయవాడలోని చాలాప్రాంతాలు బుడమేరు వాగు వరదలో చిక్కుకున్నాయి. అనేక అపార్ట్ మెంట్ లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించింది.