విజయవాడలో పవర్ బోట్స్ ద్వారా NDRF సిబ్బంది సహాయక చర్యలు
విజయవాడ వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల వరద పోటెత్తుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 12:00 PM ISTవిజయవాడ వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల వరద పోటెత్తుతూనే ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం చంద్రబాబు నుంచి ఉన్నతాధికారులు అంతా బాధితులను ఆదుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. అయితే.. విజయవాడలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు అందించాలని కేంద్రాన్ని ఆదివారం సీఎం చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన కేంద్రం కూడా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు.. పవర్ బోట్స్‌ను పంపించింది. విజయవాడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. లుథియానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి బోట్స్‌ను కేంద్ర ప్రభుత్వం విజయవాడకు పంపించాయి.
ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. ఇళ్లలో ఇరుక్కుపోయిన వరద బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు వేగంగా చర్యలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే వారికి దుస్తులు కూడా ఇవ్వాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే.. పాల ప్యాకెట్లు, ఆహారం, వాటర్ బాటిల్స్‌ను వరద బాధితులకు ప్రభుత్వం అందజేసింది. ఈ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు.
ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు. చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం సైతం చురుకుగా పనులు నిర్వర్తిస్తోంది. నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకూ ఆహారం సిద్ధం చేసి అధికారులు పంపిణీ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు రాత్రి నుంచి విజయవాడలోనే ఉంటూ నిద్రాహారాలు మాని మరీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.