ఆ రోజుల్లో ఫ్రీ.. విజయవాడ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతుంటారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 6:10 AM GMTఆ రోజుల్లో ఫ్రీ.. విజయవాడ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతుంటారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే.. విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం వెళ్తున్నభక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవడానికి వీకెండ్‌లో బస్సులు ఏర్పాటు చేస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉచితంగా బస్సులను నడపాలని విజయవాడ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి వచ్చే భక్తుల కోసం దేవస్థానానికి చెందిన 12 బస్సులు ఉంటే.. వీటిలో 8 బస్సుల్లో భక్తులను ఉచితంగా ఆలయానికి చేరవేరుస్తారు. ఆలయ అధికారులు దీని కోసం పార్కింగ్ ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు భక్తులను కొండపైకి చేర్చేందుకు పున్నమిఘాట్ నుంచి రెండు బస్సులను నడపాలని విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇటు మోడల్ గెస్ట్‌హౌస్ నుంచి నాలుగు బస్సులు, వీఎంసీ ఎదురు పార్కింగ్ వద్ద నుంచి రెండు బస్సులను ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. శుక్ర, శని, ఆది వారాల్లో దేవస్థానం సిబ్బందితో పాటు వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది కూడా విధుల్లో పాల్గొంటారు.
మరోవైపు ఈ మూడు రోజుల్లో ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో వాహనాల రద్దీని బట్టి కొండపైకి పరిమిత సంఖ్యలో వాహనాలను అనమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొండపైన ఓం టర్నింగ్ వద్ద పార్కింగ్ ప్రాంతంలో 150 కార్లు, బైకులకు మాత్రమే స్థలం ఉంది. అందుకే వాహనాలను కిందే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.