నియోజకవర్గానికి ఐదుగురు!

There is a chance of major changes in the list of YCP candidates in the upcoming elections. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థుల లిస్టులో భారీ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ సంకేతాలు

By సునీల్  Published on  8 Aug 2022 10:53 AM GMT
నియోజకవర్గానికి ఐదుగురు!

టాప్ ప్రయారిటీలో ఎంపిక

40 మంది వరకు ఉద్వాసన తప్పదా?

సర్వేలతో మారుతున్న సమీకరణాలు

రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థుల లిస్టులో భారీ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. 2019లో గెలిచిన 151 మందిలో 20 నుంచి 40 స్థానాల్లో కొత్త ముఖాలు కనిపిస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం వద్దనున్న హిట్ లిస్టులో 40 పేర్లున్నట్లు సమాచారం. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు నివేదికలు అందాయి. ఇటీవల ప్రారంభించిన నియోజకవర్గాల సమీక్షలో ఆ విషయాన్నీ సీఎం జగన్ ప్రస్తావించారు. వ్యక్తుల కన్నా తనకు పార్టీ ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.

కొత్త వ్యూహంతో ముందుకు

రాబోయే ఎన్నికల కోసం వైసీపీ కొత్త వ్యూహాన్ని రచించింది. నియోజకవర్గాల్లో తమదే రాజ్యం అని ఎమ్మెల్యేలు భావిస్తుంటారు. అయితే ప్రజల్లోకి వెళ్లి, పని చేయకుంటే మార్పు తప్పదనేలా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇకనుంచి నియోజకవర్గాల్లో పేరు, గుర్తింపు ఉండి పార్టీ కోసం పని చేస్తున్న ఐదుగురి పేర్లతో జాబితాలు రూపొందించాలనే వ్యూహానికి తెర తీసింది. నియోజకవర్గాల్లో అంగ బలం, అర్ధబలం ఉన్న వారితో లిస్టులు సిద్ధం చేస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి పనితీరు సరిగా లేకుంటే వారిని మార్చేస్తారనే సంకేతాలు ఇస్తోంది. పార్టీ ఈ విధమైన ఆలోచన చేయడంపై కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పని చేసిన వారందరినీ పార్టీ గుర్తించడం వల్ల ఎమ్మెల్యేల్లో కూడా బాధ్యత పెరుగుతుందని చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలో సమూల మార్పులు

రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కన్నా ఉత్తరాంధ్రలో ఎక్కువ మార్పులు ఉండబోతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన ఇద్దరు మాజీ మంత్రులకు వచ్చే ఎన్నికల్లో బెర్తులు కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాల్లో వారిపై పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయంపై దృష్టి సారించిన అధినేత ఎలాగైనా ఆ నియోజకవర్గాల్లో గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం అభ్యర్థులను మార్చే అంశంపై పరిశీలిస్తున్నారు. కొత్త అభ్యర్థులను ప్రకటించడంతోపాటు, మాజీలను పార్టీ కోసం పని చేయించి, అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేది ఆలోచనగా కనిపిస్తోంది.

తెరపైకి వారసుల పేర్లు

రాష్ట్రంలో సీనియర్ నేతల్లో చాలామంది తమ వారసులను ఫోకస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేల్లో వ్యతిరేకత వచ్చినట్లు తేలిన ఎమ్మెల్యేలు కొత్త ముఖాలకు బదులుగా తమ వారసులను నిలబెట్టాలని అభ్యర్థిస్తున్నారు. గత మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలతోపాటు, ప్రభుత్వ కార్యక్రమాలకూ తమ వారిని తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. గత నెలలో జరిగిన వైసీపీ ప్లీనరీలో తనయులు ఫోకస్ అయ్యేలా వారు గట్టి ప్రయత్నాలే చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాబోయే ఎన్నికల్లో తన కుమారుడికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరో మాజీ మంత్రి కృష్ణా జిల్లాకు చెందిన పేర్ని వెంకట్రామయ్య(నాని) కూడా తన కుమారుడు కృష్ణమూర్తిని పార్టీ కార్యక్రమాల్లో బాగా ఫోకస్ చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమారుడు సందీప్‌ను రాబోయే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయించాలనుకుంటున్నారు. విజయనగరం జిల్లా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తెను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలనుకుంటున్నారు. అలాగే మరికొంతమంది కూడా వారసులను ప్రమోట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా వైసీపీలో కొత్త ముఖాలతోపాటు, వారసులూ ఈసారి పోటీలో ఉండబోతున్నారు.

Next Story