వచ్చేది టీడీపీ ప్రభుత్వమే..అప్పుడు ప్రతి ఏటా డీఎస్సీ: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 1:21 PM ISTవచ్చేది టీడీపీ ప్రభుత్వమే..అప్పుడు ప్రతి ఏటా డీఎస్సీ: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. రెండో సారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే.. జగన్ సర్కార్‌ను గద్దె దించాలని టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. తాజాగా నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 'శంఖారావం' యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
ఉత్తరాంధ్ర అమ్మలాంటిది అని నారా లోకేశ్ అన్నారు. అమ్మ ప్రేమలో ఎలా కండీషన్స్ ఉండవో.. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలూ అంతే అన్నారు. పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని చెప్పారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ శ్రీకాకుళం అని గుర్తు చేశారు. ఇలాంటి గొప్ప ప్రాంతం నుంచి 'శంఖారావం' యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని నారా లోకేశ్ చెప్పారు. టీడీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్రను టీడీపీ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ దాన్ని గంజాయి క్యాపిటల్‌గా మార్చారంటూ ఆరోపణలు చేశారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొత్త నాటకం ఆడుతున్నారని లోకేశ్ ఫైర్ అయ్యారు.
2019 ఎన్నికలకు ముందు 23వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత 18వేల పోస్టులే ఉన్నాయని చెప్పారని అన్నారు. స్కూల్ రేషనలైజేషన్ పేరుతో డీఎస్సీ పోస్టులను తగ్గించారని లోకేశ్ అన్నారు. నామమాత్రంగా ఎన్నికల ముందు 6వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా లక్షా 70వేల పోస్టులు భర్తీ చేశారని లోకేశ్ చెప్పారు. ఇక ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని దీమాగా చెప్పారు.తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేశ్ అన్నారు.