నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ కారుకి ప్రమాదం, గాయాలు
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 9 April 2024 12:48 PM GMTనంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ కారుకి ప్రమాదం, గాయాలు
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు ఎలాగైనా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారం జోరు అందుకుంది. ఆయా పార్టీల నుంచి టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కాగా.. టికెట్ల కేటాయింపులో భాగంగా నంద్యాల టికెట్‌ను టీడీపీ తీసుకుంది. ఆ స్థానంలో ఎన్‌ఎండీ ఫరూక్‌ను పోటీకి దించింది. ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కారు ప్రమాదానికి గురైంది.
నంద్యాల నుంచి కర్నూలుకి కారులో బయల్దేరారు నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్. ఆయన కారు పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గరకు రాగానే ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఎదురుగా వచ్చిన బర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా ధ్వంసం అయ్యింది. అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నాయి. దాంతో.. ఫరూక్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ఫరూక్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి టీడీపీ నేతలు, స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లిన అంబులెన్స్‌లో ఫరూక్‌ను ఆస్పత్రికి తరలించారు.