ఏపీ సీఐడీ చీఫ్‌పై చర్యల కోసం అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2023 3:05 PM IST
TDP, MP Ram mohan naidu, letter,  HM amit shah,

ఏపీ సీఐడీ చీఫ్‌పై చర్యల కోసం అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబుని ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆయన ఏ తప్పే చేయలని చెబుతోంది టీడీపీ. ఆయన పేరు లేకున్నా రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారాన్ని నారా లోకేశ్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వైసీపీ పాలన గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వివరించారు. కాగా.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ సర్వీస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏపీ సీఐడీ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ తమ దగ్గరున్న పలు ఆధారాలను కూడా జత చేశారు రామ్మోహన్‌నాయుడు.

ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేయాల్సింది పోయి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌ అన్నింటినీ ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. సీఐడీ చీఫ్ వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆరోపించారు. విచారణ లేకుండానే స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్‌ చేశారన్నారు. సీఎం జగన్‌ మెప్పుకోసమే ప్రతిపక్షాలపై ఏపీ సీఐడీ చీఫ్‌ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రామ్మోహన్‌నాయుడు లేఖలో పేర్కొన్నారు. సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారని అన్నారు. దర్యాప్తు అంశాలను గోప్యంగా ఉంచకుండా.. సీఐడీ అధికారులు కావాలనే చంద్రబాబు పరువు ప్రతిష్టలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని రామ్మోహన్‌ నాయుడు లేఖలో ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా దేశవ్యాప్తంగా ప్రెస్‌మీట్లు పెట్టడం తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోరారు. ఈ క్రమంలో సీఐడీ చీఫ్ సంజయ్‌ ఉల్లంఘించిన సర్వీస్‌ రూల్స్‌, అతిక్రమించిన నిబంధనలు, అడ్డగోలు ప్రవర్తనపై ఆధారాలను హోంమంత్రి అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పంపారు. ఇక ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story