ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 12:08 PM ISTఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయన మాట్లాడుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వెళ్లిపోయారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరాలు తెలుపుతూనే ఉన్నారు.
జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రీయింబర్స్‌మెంట్ ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనగా.. పూర్తి రీయింబర్స్‌మెంట్ అంతా అబద్ధమంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఆ తర్వాత మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అని, వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని టీడీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.
గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించారనీ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం చివరిలో టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ కామెంట్స్ చేశారు. ఈ మేరకే సభ నుంచి వాకౌట్ చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక గవర్నర్ వెళ్లిపోయే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీచార్జ్ చేస్తారా? ఎమ్మెల్యేలను అడ్డుకుంటారా అని టీడీపీ ముఖ్యనేతలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారంపై ఫైర్ అయ్యారు.