ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్

తనని గెలిపించిన ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని కౌన్సిలర్‌ ఆవేదన చెందాడు. నిండు సభలో అందరి ముందే చెప్పుతో కొట్టుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2023 7:21 AM GMT
TDP Councillor, chappal, Slap himself, narsipatnam,

ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్

తనని గెలిపించిన ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని ఓ కౌన్సిలర్‌ ఆవేదన చెందాడు. ఏదైనా పని చేద్దామంటూ అడ్డుపడుతున్నారంటూ కౌన్సిల్‌ సమావేశంలో మండిపడ్డాడు. ఆ తర్వాత నిండు సభలో అందరి ముందే చెప్పుతో కొట్టుకున్నాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మన్సిపల్ కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది.

నర్సీపట్నం మున్సిపల్‌ పరిధిలోని 20వ వార్డు పరిధి గిరిజనగూడెం లింగాపురంలో చిన్న పని కూడా చేయలేదని టీడీపీ కౌన్సిలర్‌ మూలపర్తి రామరాజు వాపోయాడు. కులాయిలు, వీధి దీపాలు లేవని, కాలువలో చెత్త పేరుకుపోయిందని అన్నాడు. కనీసం పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. తాను ఏదైనా చేద్దామని పనులు మొదలుపెడితే అధికార పార్టీ కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్డు సభ్యుడిగా ఎన్నిక అయ్యి 30 నెలలు దాటుతున్నా తన వార్డు పరిధిలో ఒక్క పని కూడా చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు వేయిస్తానని స్థానిక ఎమ్మెల్యే గణేష్‌ రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. తన నిస్సహాయతపై ఆక్రోశం వ్యక్తం చేస్తూ... కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నాడు. చచ్చిపోవాలని ఉందంటూ వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన వార్త స్థానికంగానే కాదు సోషల్‌ మీడియాలోనూ కలకలం రేపుతోంది.

రామరాజు అలా చెప్పుతో కొట్టుకున్న తర్వాత ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా అధికారపార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభ రసాభాసగా మారింది. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Next Story