నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితుల నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు జూన్ 9న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది ఒక వారం ఆలస్యంగా రుతుపవనాలు భారత్ లోకి వచ్చాయి. గతేడాది జూన్ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాక ప్రభావంతో కేరళలో గత 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించనున్నాయి.