ఆ మంత్రి డ్యాన్సులు తప్ప ప్రాజెక్టులను పట్టించుకోరా: షర్మిల

ప్రకాశం జిల్లా మద్దిపాడులో గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్‌ నేతలతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 8:45 AM GMT
sharmila, comments,  andhra pradesh govt, ambati,

ఆ మంత్రి డ్యాన్సులు తప్ప ప్రాజెక్టులను పట్టించుకోరా: షర్మిల  

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజే ఇటు టీడీపీ.. అటు వైసీపీపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఇవేనంటూ చెప్పుకొచ్చారు. సొంత అన్న సీఎం జగన్‌పైనా విమర్శలు చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఇక రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా మద్దిపాడులో గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్‌ నేతలతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టు మెయింటెనెన్స్‌ను గాలికి వదిలేసిందని ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డి రూ.750 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మిస్తే.. ప్రాజెక్టు మెయింటెనెన్స్‌ కోసం వైసీపీ సర్కార్‌ ఏడాదికి రూ. కోటి కూడా వ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు నిలబడుతుందనీ చెప్పారు. లేకపోతే ప్రాజెక్టు నిలబడే అవకాశం లేదు అనే విషయాన్ని ఎస్‌ఈ చెప్పారని అన్నారు. ప్రాజెక్టు కట్టి కూడా వృథా అయిపోతుందని షర్మిల వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్ షర్మిల అన్నారు. ప్రాజెక్టుకు చేయాల్సిన మరమ్మతులు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గేటు నీటిలో తేలుతోందని చెప్పారు. దాన్ని చూస్తూ మీరే అవమానంతో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్దగా చేసిందేమీ లేదనేదానికి ఈ ఒక్క ప్రాజెక్టు చాలని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల కోసం ఏం చేసిందో చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుపై షర్మిల సెటైర్లు వేశారు. ఆ మంత్రి సంక్రాంతికి డ్యాన్సులు చేయడం తప్ప.. ప్రాజెక్టుల పనుల గురించి పట్టించుకోరంటూ అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.

Next Story