జగన్ రావాలని కోరుకోవడే తప్పు అని..చెప్పుతో కొట్టుకున్న సర్పంచ్
ఏపీలో పలువురు సర్పంచ్‌లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 11:50 AM ISTజగన్ రావాలని కోరుకోవడే తప్పు అని..చెప్పుతో కొట్టుకున్న సర్పంచ్
ఏపీలో పలువురు సర్పంచ్‌లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవడానికి నిధులు ఇవ్వడం లేదంటూ ఆరోపనలు చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే నిధులు ఇవ్వకపోగా.. వాటిని సొంత అవసరాలకు వినియోగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో పలుమార్లు సర్పంచ్‌లు ఆందోళనలు చేశారు. అయినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలోనే పలువురు సర్పంచ్‌లు ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కొందరు సర్పంచ్‌లు నిధులు ఇవ్వడంలేదని బహిరంగంగా చెబుతుంటే.. ఇంకొందరు మాత్రం వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడ నిరసనలో పాల్గొన్న అరుగొలను గ్రామ సర్పంచ్ తన ఆవేదన, అక్కసు వెళ్లగక్కారు. అంతేకాదు.. సీఎం జగన్‌కు మద్దతు ఇచ్చి తప్పు చేశానంటూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. జగన్‌ను సీఎం చేసేందుకు తాను కృషి చేయడం పొరపాటు అని.. దానికి దేవుడు కూడా తనని క్షమించడు అంటూ చెప్పుతో కొట్టుకున్నాడు.
కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపిస్తూ అరుగొలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని జగన్ బాగు చేస్తారని అనుకుంటే.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. పదేళ్లపాటు భార్యాపిల్లలను, వ్యాపారాలను వదులకుని కష్టపడ్డామని చెప్పాడు. అప్పట్లో జైలు పాలైన జగన్‌కు బెయిల్ రావాలంటూ మేరీ మాతను కూడా వేడుకుని మొక్కులు తీర్చుకున్నానని చెప్పారు అరుగొలను సర్పంచ్. గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలన్నీ జగన్ పేరిటే చేశానని.. కానీ ఇప్పుడు నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పు చేసినందుకు తనని తానే చెప్పుతో కొట్టుకుంటూ నిరసన తెలిపుతున్నానని చెప్పాడు సర్పంచ్ పీతల బుచ్చిబాబు.