ఆ విషయం గురించి మాట్లాడడానికి భయపడ్డ తలైవా ..!
Rajinikanth comments at NTR 100 years celebrations. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో రజనీకాంత్ మాట్లాడారు.
By M.S.R Published on 29 April 2023 3:49 AM GMTఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో రజనీకాంత్ మాట్లాడారు. ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తుందన్నారు. కానీ.. రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోందని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఆయన ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసని తెలిపారు. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని అన్నారు. చాలాకాలం తర్వాత హైదరాబాద్‌ను సందర్శించాను.. నేను హైదరాబాద్‌లో ఉన్నానా.. లేక న్యూయార్క్‌లో ఉన్నానా అనిపించిందని రజనీకాంత్ అన్నారు. చంద్రబాబు 30 ఏళ్ల నుంచి తనకు మిత్రుడని.. మోహన్‌బాబు పరిచయం చేశారని చెప్పారు. అప్పటి నుంచి హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా చంద్రబాబును కలిసి మాట్లాడేవాడినని అన్నారు.
ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ సినిమాను 1956-57లో నేను మొదటిసారి చూశానని తెలిపారు. అప్పుడు నాకు ఆరేడేళ్ల వయసుంటుంది. వెండితెరపై చూసిన 20 అడుగుల పాతాళ భైరవి విగ్రహం నా మైండ్‌లో నాటుకుపోయింది. అప్పటి నుంచి ఏ మహిళ ప్రతిమ చూసినా అది భైరవియేనా అని అడిగేవాడిని. అంతగా నా మనసులో నాటుకుపోయింది. ఎన్టీఆర్‌తో కలిసి ‘టైగర్’ సినిమాలో నటించానని అన్నారు. అప్పుడు నాకు కోపం ఎక్కువ. సెట్‌లో అందరి మీదా అరిచేసేవాడిని.. దాంతో నన్ను ఆ సినిమాలో నుంచి తొలగించాలని కొందరు ఫిర్యాదు చేశారు. అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆయనకు కోపం వస్తుంటే.. ప్రేమగా చూసుకోండి.. రజనీకాంతే సినిమాలో ఉండాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టుకుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానని అన్నారు. ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించేవారని అన్నారు. దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్‌లా ఉండాలనుకున్నానని, ఆయనలా మేకప్ వేసుకుని ఫొటో దిగి తన స్నేహితుడికి చూపిస్తే.. నేను కోతిలా ఉన్నానని వాళ్లు చెప్పారని అన్నారు. చాలారోజుల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నానని, తన తెలుగులో తప్పులు ఉంటే క్షమించాలని కోరారు.