విజయసాయిరెడ్డిపై సుప్రీం సీజేకు ఫిర్యాదు చేసిన పురందేశ్వరి
విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 7:15 AM GMTవిజయసాయిరెడ్డిపై సుప్రీం సీజేకు ఫిర్యాదు చేసిన పురందేశ్వరి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ ఉన్న విజయసాయిరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారంటూ ఆరోపించారు పురందేశ్వరి. ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో.. కడప గూండాలను అక్కడ దించి, భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పారు. ఎందరినో బెదిరించి అక్రమాలు, అరాచకాలు చేశారంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిపై ఉన్న అన్ని కేసుల వివరాలను తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన లేఖలో పేర్కొన్నారు. పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డిపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖతో పాటు ఐదు డాక్యుమెంట్లను కూడా పురందేశ్వరి జతచేశారు. పదేళ్లకుపైగా బెయిల్‌పై ఉన్నారు. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా ఆలస్యం చేస్తూ నిరోధిస్తున్నారు. పదే పదే వాయిదాలతో విచారణకు రాకుండా ఉంటున్నారు అని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తన లేఖలో పేర్కొన్నారు.