ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు, దెబ్బతిన్న పిల్లర్ పునాది
బ్యారేజీ వద్ద ఉన్న మూడు పడవలు లాక్ చైన్ తెగిపోవడంతో వరదలు కొట్టుకుని బ్యారేజీ వైపు దూసుకు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 9:59 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. చాలాచోట్ల వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి కూడా భారీ వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే నగరం మొత్తం వరద నీటిలో మునిగిపోగా.. అధికారులు అప్రమత్తం అయ్యి బ్యారేజీ అన్ని 70 గేట్లను పూర్తిస్థాయిలో పైకి ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. కానీ.. ప్రకాశం బ్యారేజీలో ప్రమాదం సంభవించింది. బ్యారేజీ వద్ద ఉన్న మూడు పడవలు లాక్ చైన్ తెగిపోవడంతో వరదలు కొట్టుకుని బ్యారేజీ వైపు దూసుకు వచ్చాయి.
వేగంగా వచ్చిన బోట్లు ప్రకాశం బ్యారేజీ గేటు 69ను ఢీ కొన్నది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజీ అయ్యింది. 69వ నెంబరు గేట్ వద్ద పిల్లర్ పునాది దెబ్బతింది. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు బోట్లు గేట్ల ముందే అడ్డుపడ్డాయి. వరద నీరుకు అడ్డుగా ఉండటంతో అధికారులతో పాటు ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికే బోట్లను పక్కకు లాగినట్లు తెలిసింది. బోట్లు బలంగా ఢీకొట్టిన ప్రాంతంలో బ్యారేజ్‌కి కూడా పగుళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రమాందం పొంచి ఉందనేది తెలియరాలేదు. 70 గేట్ల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీలోని 69వ నెంబరు గేట్ వద్ద పిల్లర్ పునాది దెబ్బతింది. సోమవారం తెల్లవారుజామున ఎగువన ఉన్న కొన్ని పడవలు వరద నీటిలో తేలుతూ వచ్చి గేటును ఢీకొన్నాయి. జలవనరుల శాఖ అధికారులు మొత్తం 70 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. pic.twitter.com/8RV5ctl7EF
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 2, 2024