వేగంగా ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులు

ఇటీవల సంభవించిన వరదల్లో ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  8 Sep 2024 6:45 AM GMT
వేగంగా ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులు

ఇటీవల సంభవించిన వరదల్లో ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా అధికారులు ముమ్మరంగా మరమ్మతు పనులు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ కౌంటర్‌ వెయిట్‌లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు. 67, 69 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్లలో మెటల్, కాంక్రీట్‌ను నింపుతున్నారు. ఈ పనులన్నీ చురుగ్గా కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇంకా వరద ఉధృతంగా కొనసాగుతోంది. అయినా కూడా సాహసోపేతంగా పనులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు గేట్లను మూసివేసి మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.

ఏం జరిగిందంటే..

ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. కృష్ణా నది పొంగి ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద ఉధృతికి అక్కడున్న పడవలు కొట్టకుపోయాయి. మూడు పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. ఒకటి కౌంటర్‌ వెయిట్‌ను ఢీకొనడంతో అది విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డుపడటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా జరగలేదు. అలా ధ్వంసమైన గేటు పనరుద్ధరణ పనులు ప్రస్తుతం చేపడుతున్నారు.

కాగా.. మరోవైపు విజయవాడ మొత్తం వరద నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో అనేక కాలనీల్లో వరద పూర్తి స్థాయిలో తగ్గింది. మరి కొన్ని కాలనీల్లో పాదాలు తడిసేంత వరద నీరు ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వరద నీరు తొలగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది.



Next Story