రూల్స్ పాటించాలి..పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే కుదరదు: పోలీసులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 6 July 2024 2:15 PM ISTరూల్స్ పాటించాలి..పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే కుదరదు: పోలీసులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి చాలా మంది అభిమానులు, జనసైనికులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వాహనాల నెంబర్ ప్లేట్లపై రాసుకుంటున్నారు. అయితే వాహనాల నంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లు అంటించిన వారికి పోలీసులు షాకిస్తున్నారు. నంబర్ ప్లేట్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఓ స్కూటీ యజమానిని ఆపి ఆ స్టిక్కర్ తొలగించే వరకు పోలీసులు వదల్లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసి ఉంచిన నెంబర్ ప్లేట్‌తో ఉన్న స్కూటీని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆస్టిక్కర్ గురించి నిలదీశారు. నెంబర్ ప్లేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయొద్దనీ.. మార్చాలంటూ సూచించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అన్నారు. అభిమానం ఉంటే తప్పులేదని.. కానీ నంబర్ ప్లేట్‌పై ఇలాంటి స్టిక్కర్లు అంటించడం సరికాదని పోలీసులు హెచ్చరించారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని అన్నారు. నెంబర్ ప్లేట్‌పై స్టిక్కర్ అంటిస్తే బైక్ చోరీకి గురైనప్పుడు గుర్తించడం కష్టం అవుతుందనీ..దాని వల్ల మీకే ఇబ్బందులంటూ చెప్పారు. పోలీసులు ఆ స్టిక్కర్ ని ఆ యువకులతోనే తీసివేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. ఇంతకుముందు ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తనకు చెడ్డపేరు తీసుకురావొద్దనీ.. అభిమానం పేరుతో నిబంధనలు ఉల్లంఘించొద్దని కోరారు. ఒకవేళ పోలీసులు, ఆర్టీవో అధికారులు వాహనాలను ఆపి నంబర్ ప్లేట్ గురించి అడిగితే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పొద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పొద్దు అన్నారు. అందరూ చట్టాల్ని గౌరవించాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే.