పవన్ ఢిల్లీ పయనం వెనుక అసలు రహస్యం ఇదే..?
Pawankalyan Delhi Tour .. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఢిల్లీ పయనమయ్యారు. ఇలా సడెన్‌గా పవన్
By సుభాష్ Published on 24 Nov 2020 5:47 AM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఢిల్లీ పయనమయ్యారు. ఇలా సడెన్‌గా పవన్ ఢిల్లీ వెళ్లడంపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆ తర్వాత వెనక్కి తగ్గారు. సమయం లేని కారణంగా తాము పోటీ చేయడం లేదని, బీజేపీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే పవన్ ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడం వెనుక రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీకి సన్నిహితంగా మారింది. ఇప్పటి వరకు కలిసి కార్యక్రమాలు నిర్వహించింది ఏమిలేదు. కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందేమి లేదు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని మంళగిరిలో జరిగిన పార్టీ సమావేశాల్లో పవన్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో దూకుడు మీద కనిపిస్తున్న బీజేపీ.. జనసేన పార్టీతో జత కడితే తమపై ఆంధ్ర ముద్ర పడుతుందనే భయంతో పవన్‌ను గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా నిలువరించగలిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజులుగా సైలెంట్‌గా ఉన్న పవన్.. ఒక్కసారిగా సోమవారం రాత్రి ఢిల్లీకి పయనమయ్యారు.
తిరుపతి సీటు కోసమేనా..?
ఏపీలోని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన దుర్గాప్రసాద్ కరోనా వైరస్‌తో మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరిగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీని ఉప ఎన్నికల బరిలో ముందుగా నిర్ణయించింది. ఆ తర్వాత అధికార వైసీపీ కూడా గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపాలని తీర్మానించింది. అయితే గతంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ .. ఈ ఉప ఎన్నిక బరిలో దిగుతుందా..?లేక మిత్రపక్షమైన జనసేనకు సీటు కేటాయిస్తుందా.?అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో తిరుపతి ఉప ఎన్నిక బరిలో స్వయంగా పవన్ కల్యాణ్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని హస్తిన వర్గాలు చెప్పుకొంటున్నాయి. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పవన్ కల్యాన్ తిరుపతి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తే భవిష్యత్తు ఉంటుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రంలో మరో మూడున్న సంవత్సరాల పాటు మోదీ సర్కార్ కొనసాగుతున్న నేపథ్యంలో సింగిల్ ఎంపీగా ఢిల్లీకి చేరిన కూడా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని పవన్ కల్యాణ్‌కు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో తిరుపతి లోక్‌సబ టికెట్ అడిగేందుకు పవన్ ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు.ఢిల్లీ వెళ్లిన పవన్.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను, బీజేపీ నేతలను కలువనున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.