నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌ పడింది.

By Srikanth Gundamalla
Published on : 4 Dec 2023 1:12 PM IST

nara lokesh, yuvagalam yatra, break,

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మరోసారి అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ తన యువగళం పాదయాత్రకు మరోసారి వాయిదా వేసుకున్నారు. వర్షాలు భారీగా కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో పాదయాత్ర చేయడం సులువు కాదన్న అభిప్రాయంతో వెనక్కి తగ్గారు. మిచౌంగ్ తుపాను మంగళవారం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటనుంది. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో మూడ్రోజుల పాటు యువగళం పాదయాత్రకు లోకేశ్ విరామం ఇచ్చారు.

కాగా.. వర్షాల నేపథ్యంలో రోడ్డుమార్గాన టీడీపీ నేత నారా లోకేశ్‌ అమరావతికి బయల్దేరారు. తిరిగి ఆరో తేదీ నాడు రాత్రి వరకు పిఠాపురం నియోజకవర్గానికి లోకేశ్‌ చేరుకోనున్నారు. యువగళం పాదయాత్ర వాయిదా పడిన సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్‌.. ముంచుకొస్తున్న తుపాను పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుపాను బాధితులకు టీడీపీ తరపుణ పార్టీ క్యాడర్... నేతలు ఆసరాగా నిలవాలని లోకేశ్ కోరారు. మిచౌంగ్ తుపాను తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. విపత్తు సంస్థలు జారీ చేసే హెచ్చరికలు ప్రజలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ.. ఆ మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని లోకేశ్ కోరారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో అస్సలు ఉండకూడదని చెప్పారు నారా లోకేశ్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అన్ని విధాలా సహాయాలు చేయాలని లోకేశ్ కోరారు.

Next Story