నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా

లోకేశ్‌ తన యువగళం పాదయాత్రను మరోసారి వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2023 4:35 PM IST
Nara lokesh,   padayatra, postpone, AP Politics ,

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సెప్టెంబర్ 29వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్రను మొదలు పెట్టాలని భావించారు లోకేశ్. ఇటీవల జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. లోకేశ్‌ తన యువగళం పాదయాత్రను మరోసారి వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకుల సూచనల మేరకే వాయిదా వేసేందుకు నిర్ణయించారు లోకేశ్.

చంద్రబాబు అరెస్ట్‌తో సెప్టెంబర్ 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజవకర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర నిలిచిపోయింది. దాదాపు 20 రోజుల పాటు పాదయాత్ర ఆగిపోయింది. చంద్రబాబు అరెస్ట్‌పై నారా లోకేశ్‌ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతికి కూడా ఏపీలో అధికార పార్టీ వైఖరిని తప్పుబడుతూ సమావేశం అయ్యారు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 29 నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని.. ప్రజల్లోకి వైసీపీ ప్రభుత్వం తీరుని తీసుకెళ్లి ఎండగట్టాలని అనుకున్నారు. కానీ.. అక్టోబర్ 3వ తేదీ సుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన వాదనలు ఉన్నాయి. ఆయన పాదయాత్రలో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని దాంతో.. పాదయాత్రను వాయిదా వేసుకోవాలని ముఖ్య నేతలు నారా లోకేశ్‌ను కోరారు.

చంద్రబాబుని ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదించాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్ నాయకులు అభిప్రాయం తెలిపారు. పాదయాత్రలో లోకేశ్ ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణకు కష్టం అవుతుందని లోకేశ్‌తో చెప్పారు. పార్టీ నాయకుల అభిప్రాయలతో నారా లోకేశ్‌ కూడా ఏకీభవించారు. దాంతో.. యువగళం పాదయాత్రను మరోసారి వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక త్వరలో మరోసారి పార్టీ నేతలతో చర్చించి యువగళం పాదయాత్రపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Next Story