నా కంపెనీలో 2శాతమే రూ.400 కోట్లు..మాకెందుకు ప్రజల సొమ్ము: భువనేశ్వరి

చంద్రబాబు ఏం తప్పు చేశారని 17 రోజులుగా జైల్లో ఉంచారని నారా భువనేశ్వరి ప్రశ్నించారు.

By Srikanth Gundamalla  Published on  25 Sep 2023 9:00 AM GMT
Nara Bhuvaneswari, Comments,  Chandrababu Arrest ,

నా కంపెనీలో 2శాతమే రూ.400 కోట్లు..మాకెందుకు ప్రజల సొమ్ము: భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్‌ చేయడం..ఆ తర్వాత జైల్‌లో రిమాండ్‌లో ఉంచడం.. మళ్లీ సీఐడీ విచారణ జరపడం వంటి విషయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో ఆయన కుటుంబ సభ్యులంతా నిరసనల్లో పాల్గొంటున్నారు. తాజాగా చంద్రబాబు సతీమని నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజల మనిషి అని.. 45 ఏళ్ల పాటు ప్రజాసేవలో ఉండిపోయారని నారా భువనేశ్వరి అన్నారు.

చంద్రబాబు ఏం తప్పు చేశారని 17 రోజులుగా జైల్లో ఉంచారని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించిన భువనేశ్వరి.. టీడీపీ వ్యవస్థాపకుడు రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి.. తమ కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదని చెప్పారు. తాను ఒక సంస్థను నడిపిస్తున్నానని.. అందులో కేవలం 2శాతం అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. అలాంటిది తమకు ప్రజల డబ్బు ఎందుకు అని అన్నారు. తమ కుటుంబం అంతా ఎన్టీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తోందని చెప్పారు భువనేశ్వరి. తమ కుటుంబానికి ఎలాంటి కోరికలు లేవని.. ఉన్నవాటితోనే సంతృప్తి పడేవారమని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ఏనాడూ అవినీతికి పాల్పడలేదని నారా భువనేశ్వరి చెప్పారు.

చంద్రబాబుకి ప్రజలే ఊపిరి అన్నారు. ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే చంద్రబాబు ఆలోచిస్తారని నారా భువనేశ్వరి తెలిపారు. రాళ్లు, రప్పలుగా ఉన్న ప్రాంతాన్ని హైటెక్‌ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబుదే అని చెప్పారు. రాత్రింబవళ్లు పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు జైల్లో నిర్బంధించారని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని ఆమె అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా చాలా మంది ఉపాధి పొందారు.. ప్రజల కోసమే చంద్రబాబు జైలుకెళ్లారని అన్నారు. ఇక ఐటీ ఉద్యోగులు తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తుండగా పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల తీరుని ఖండిస్తున్నానని ప్రకటించారు. ప్రజలకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని.. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని భువనేశ్వరి ఫైర్ అయ్యారు.

Next Story