ఎటు తేలని ఏలూరు మిస్టరీ.. రంగంలోకి WHO బృందం
Mystery Disease in Andhra Pradesh Eluru .. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ప్రజలు అంతు చిక్కని వ్యాధితో తీవ్ర అస్వస్థతకు
By సుభాష్ Published on 7 Dec 2020 4:20 PM IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ప్రజలు అంతు చిక్కని వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురి కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. రెండు రోజుల నుంచి ఒకరి తర్వాత ఒకరు ఇలా దాదాపు 450 మంది వరకు అస్వస్థతకు గురైన వారి సంఖ్య చేరుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం డబ్ల్యూహెచ్వో సహకారం కోరింది. అయితే ఈ అనారోగ్యానికి సంబంధించిన కారణాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ నిపుణులు దర్యాప్తు కోసం ముందుకు వచ్చారు. 45 ఏళ్లు ఉన్న వ్యక్తి ఒకరు మరణించగా, 150 మందికిపైగా డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 160 మంది వరకు చికిత్స పొందుతున్నారు. మరి కొందరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.
అయితే ఈ అంతుచిక్కని వ్యాధి ఒకరి నుంచి మరొకరికి మాత్రం సోకలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు ఏలూరు మున్సిపాలిటీ పంపిణీ చేసే నీరే కారణమని భావిస్తుండగా, ఆ నీళ్లు తాగని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు సైతం ఈ అంతుచిక్కని వ్యాధిపై ఏమి చెప్పలేకపోతున్నారు.
సీఎం జగన్, ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. రోగులు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనారోగ్యానికి సంబంధించి, నీటి నమూనాలు, రక్త నమూనాల ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రక్త పరీక్షలు, సిటీ స్కాన్ రిపోర్టుల్లో సైతం సాధారణంగానే ఉన్నాయని సీఎం జగన్‌కు వివరించారు. నీటి కాలుష్యమే అనారోగ్యానికి కారణమన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు సోమవారం సాయంత్రంలోగా లేదా మంగళవారం ఏలూరుకు చేరుకుంటారని తెలుస్తోంది.