చంద్రయాన్ విజయంపై టీడీపీ ఆర్భాటం ఏంటో: విజయసాయిరెడ్డి
టీడీపీ నాయకులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 8:30 PM ISTచంద్రయాన్ విజయంపై టీడీపీ ఆర్భాటం ఏంటో: విజయసాయిరెడ్డి
టీడీపీ నాయకులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. చంద్రయాన్ స్పీడ్‌తో రాష్ట్రంలో టీడీపీ దూసుకుపోతుందని.. ఆ పార్టీ నాయకులు అర్థరహితంగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా చంద్రయాన్ విజయంపై టీడీపీ ఆర్భాటం చేస్తుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రతి పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. అయితే వాటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేసే దిశగా సమావేశాలు సాగుతున్నాయని.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం లభించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయదుందిభి మోగిస్తుందని చెప్పారు. టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే ఉన్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు.
గతంలో జరిగి ప్రతి ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిందని అన్నారు విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని అన్నారు. ప్రజల డబ్బుతో కట్టిన రిషికొండలో భవనాలను ఎందుకు కూలుస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు, లోకేశే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం వారి కల అనీ.. మరోసారి ఏపీ సీఎంగా జగన్ ఎన్నికవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు విజయసాయిరెడ్డి. పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని తామే గెలుస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి దీమా వ్యక్తం చేశారు.