మీసాలు తిప్పడం..తొడలు కొట్టడానికి సినిమా అసెంబ్లీ కాదు: రోజా
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 4:24 PM ISTమీసాలు తిప్పడం..తొడలు కొట్టడానికి సినిమా అసెంబ్లీ కాదు: రోజా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో.. స్పీకర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మీసాలు తిప్పుతూ.. తొడకొట్టడంపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే అసెంబ్లీ స్పీకర్ కూడా ఇలాంటి చేష్టలు అసెంబ్లీ హాల్‌లో చేయొద్దని.. తొలితప్పుగా భావిస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
శాసనసభలో టీడీసీ సభ్యులు రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని మంత్రి రోజా అన్నారు. స్పీకర్‌కు, ఆయన చైర్‌కు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని.. నీచంగా ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు. పోడియం పైకి ఎక్కి.. పేపర్లు చించి ముఖాన విసురుతారా అంటూ ప్రశ్నించారు. సభా సాంప్రదాయాన్ని పాటించకుండా అత్యంత జుగుప్సాకరంగా రచ్చ చేశారని మంత్రి రోజా అన్నారు.
ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టిలో అసెంబ్లీ అంటే షూటింగ్ అనుకుంటున్నారమో అని అన్నారు. బాలకృష్ణ నిండు సభలో మీసం మెలేసి తొడగొట్టమేంటని ప్రశ్నించారు. ఆయన మీసం మెలేసి.. తొడగొడితే భయపడేవారు ఎవరూ లేరని అన్నారు. తనతో పాటు ఎమ్మెల్యేగా తొమ్మిదేళ్లు బాలకృష్ణ కూడా ఉన్నారని.. హిందూపురం నియోజకవర్గం గురించికానీ.. అక్కడి ప్రజల గురించి కానీ బాలకృష్ణకు ఏమీ తెలియదంటూ విమర్శించారు. ఆయన బావ కళ్లలో ఆనందం చూడటం కోసమే ఈవిధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో దొంగగా ఆధారాలతో సహా దొరికి చంద్రబాబు జైలుకెళ్తే.. ప్రజలకు కోర్టులు, చట్టాల పట్ల నమ్మకం కలిగిన తరుణంలో బాలకృష్ణ ఈ స్థాయికి దిగజారడం ఏం బాగోలేదని మంత్రి రోజా అన్నారు.
టీడీపీ నేతలు ఇవాళ ఎంత హంగామా చేసిన సభ నుంచి తప్పించుకున్నా.. రేపు చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరుగుతుంది కదా.. అప్పుడు బాలకృష్ణకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మేమే స్పీకర్‌ను కోరతామని మంత్రి రోజా అన్నారు. అప్పడేం మాట్లాడతారో చూస్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందని చెబుతాడో.. అందులో తన బావ చంద్రబాబు దొంగ అని అంటాడో లేదో.. రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంలో రూ.241 కోట్లు షెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు ఎలా చేరాయో చెబుతాడేమో చూద్దామని మంత్రి రోజా అన్నారు.
కాగా.. మంత్రి అంబటి రాంబాబు తనని రెచ్చగొట్టారని.. తన వృత్తిని అవమానించారని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. దాంతో.. రా చూసుకుందాం అని ఎదురు సవాల్ విసరడంతో బిత్తరపోయారని చెప్పారు. బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిని కాదని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.