బ్రాహ్మణిని బ్రహ్మాస్త్రం అనుకుని దింపారు.. కానీ: మంత్రి రోజా
బ్రహ్మణి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు రోజా. చంద్రబాబు ఎంత వెన్నుపోటుదారుడో బ్రాహ్మణికి తెలియదా అని ప్రశ్నించారు.
By Srikanth Gundamalla Published on 17 Sep 2023 10:34 AM GMTబ్రాహ్మణిని బ్రహ్మాస్త్రం అనుకుని దింపారు.. కానీ: మంత్రి రోజా
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. చంద్రబాబుని పరామర్శించేందుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా పవన్ కళ్యాణ్‌తో తమ పొత్తు కొనసాగుతుందని తెలిపింది. అంతేకాదు.. చంద్రబాబు అరెస్ట్‌ను తామే ముందు ఖండించామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యానించారు. అలా చంద్రబాబు అరెస్ట్ కీలక పరిణామాలకు దారి తీస్తోంది. వైసీపీ నాయకులు మాత్రం చంద్రబాబు అవినీతికి పాల్పడారంటూ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో మంత్రి రోజా నారా బ్రహ్మణి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మిణి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రహ్మణి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎంత వెన్నుపోటు దారుడో నారా బ్రాహ్మణికి తెలియదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో బ్రహ్మణి ఒకసారి చూడాలని హితవు పలికారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సింపతి పొందేందుకు నారా బ్రహ్మణిని రంగంలోకి దించారని రోజా అన్నారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణిని రంగంలోకి దించారని.. కానీ ఈ అష్ట్రం కూడా తుస్సుమందని వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కూడా దేవాన్ష్‌కు సీఐడీ రిపోర్ట్ చూపించొద్దంటూ సెటైర్లు వేశారు. తాత అవినీతి పరుడా అని అనుకుంటాడని వ్యాఖ్యానించారు మంత్రి రోజా.
పవన్ కళ్యాణ్ జైల్లో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని మంత్రి రోజా విమర్శలు చేశారు. తనని నమ్మిన అభిమానులను పవన్ కళ్యాణ్ మరోసారి మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజాభిమానంతో జగన్ సీఎం అయ్యారనీ.. కానీ పవన్ కళ్యాణ్ కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని విమర్శించారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి పవన్ అని.. ఆయన జగన్ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సారి ఎన్నికల్లో కనీసం పది చోట్ల అయినా పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్‌కు అభ్యర్థులు ఉన్నారా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని మంత్రి రోజా హితవు పలికారు.