పవన్‌కు రేణూ అయినా చెప్పాలని అంబటి ట్వీట్..జనసైనికులు ఫైర్
మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 5:36 PM IST
పవన్‌కు రేణూ అయినా చెప్పాలని అంబటి ట్వీట్..జనసైనికులు ఫైర్
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వర్సెస్ ఏపీ ప్రభుత్వం నడుస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా సినిమాలపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కలెక్షన్లు, పవన్ రెమ్యునరేషన్ లెక్కలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక కొందరు వైసీపీ నాయకులు అయితే.. పవన్ కళ్యాణ్‌పై వెబ్ సిరీస్, సినిమా తీస్తామంటూ ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో రేణు దేశాయ్ స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలను లాగొద్దని.. సిరీస్ తీయడం ద్వారా ఆయన పిల్లల గురించి చెప్పాల్సి వస్తుందని.. అలా చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు రేణు దేశాయ్. దయచేసి మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడం ఆపాలంటూ రిక్వెస్ట్ చేసింది. రాజకీయాల్లో ఏవైనా ఉంటే మీరూ మీరూ చూసుకోవాలని కోరింది. ఇక బ్రో సినిమా వివాదం గురించి కూడా స్పందించిన రేణు దేశాయ్.. ఆ వివాదం గురించి తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు. శ్యాంబాబు క్యారెక్టర్ వివాదం జరిగిందనే విషయం మాత్రమే తెలుసన్నారు.
అయితే.. రేణు దేశాయ్ అలా వీడియో విడుదల చేశాక కూడా.. మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌పై జనసేన నేతలు, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మా రేణు.. మీ మాజీకి నువ్వైనా చెప్పు.. మా క్యారెక్టర్లను సినిమాల్లో పెట్టి శునకానందం పొందొద్దంటూ ట్వీట్ చేశారు. అయితే.. మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటిని ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దని కోరినా.. మళ్లీ ఆయన మాజీ భార్యకే చెప్పడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల రెమ్యునరేషన్లు, కలెక్షన్లు పక్కనబెట్టి.. మంత్రిగా తన పని చూసుకోవాలని సూచిస్తున్నారు. ముందు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పోలవరం ప్రాజెక్టు సంగతి చూడాలని హితవు పలుకుతున్నారు పవన్ ఫ్యాన్స్, జనసైనికులు.
అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !
— Ambati Rambabu (@AmbatiRambabu) August 10, 2023