పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం విఫలమైంది: అంబటి

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  14 May 2024 4:40 PM IST
minister ambati, comments, police, election,

 పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం విఫలమైంది: అంబటి 

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఏది ఏమైనా పోలింగ్‌ మాత్రం చివరి వరకు కొనసాగేలా చూసుకున్నారు అధికారులు. పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై తాజాగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ మేరకు ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం విఫలమైందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ నేతలు దారుణంగా దాడులకు పాల్పడుతుంటే.. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కు అయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పల్నాడులో టీడీపీతో పోలీసులు కుమ్మక్కు కావడంతోనే దారుణాలకు ఒడిగట్టారనీ.. పోలీసులు ఎన్నికల విధుల్లో విఫలమయ్యారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పక్కా ప్రణాళికతోనే వ్యవహరించారంటూ ఆరోపించారు. సత్తెనపల్లి రూరల్‌ సీఐ.. టీడీపీ వాళ్లతో మాట్లాడుకున్నారంటూ ఆరోపించారు. పోలీసుల అండతో టీడీపీ నాయకులు తన అల్లుడిపై దాడి చేయడాన్ని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు.

మరోవైపు ఎన్నికల సంఘం శాంతిభద్రతల పేరుతో డీజీపీ, ఐజీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులను మార్చిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయా అని ప్రశ్నించారు. పోలీసులు పల్నాడులో తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేకపోయారని అన్నారు. అంతేకాదు.. టీడీపీ వారు తనని కూడా తిరగనీయకుండా చేశారనీ.. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదన్నారు. తనని గృహనిర్బంధం చేశారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని గృహనిర్బంధం చేసి.. ప్రత్యర్థి కన్నాను మాత్రం యథేచ్చగా పోలింగ్‌ బూత్‌లో తిరిగనిచ్చారంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

Next Story