మంగళగిరి కోర్టులో లోకేశ్ పరువునష్టం దావా..వారిని వదలనని వార్నింగ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి కోర్టుకు వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 14 July 2023 11:09 AM GMTమంగళగిరి కోర్టులో లోకేశ్ పరువునష్టం దావా..వారిని వదలనని వార్నింగ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి కోర్టుకు వెళ్లారు. పరువునష్టం కేసులో శుక్రవారం ఆయన మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. అదనపు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేశారని గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, పోతుల సునీతపై లోకేశ్ పరువునష్టం దావా వేశారు. నందమూరి ఉమామహేశ్వరి మరణం, హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వీరిపై చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ మంగళగిరి కోర్టుకు వెళ్లారు.
వాంగ్మూలం తర్వాత నారా లోకేశ్ మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలనే లక్ష్యంగానే అసత్య ప్రచారాలు చేస్తున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. 2012 నుంచే అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు నారా లోకేశ్. ఇప్పటి వరకు చేసిన ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోవాలని గతంలోనే హెచ్చరించానని.. అయినా వినకపోవడంతోనే కోర్టుకు వచ్చానని అన్నారు. పోతుల సునీత విననందుకే రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేశానని నారా లోకేశ్ చెప్పారు. తోబుట్టువులు లేని తాను.. పిన్నమ్మ కూతుళ్లనే సొంత సోదరీమణులుగా చూసుకున్నానని అన్నారు. అలాంటి తనపై గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి తప్పుడు పోస్టు పెట్టినందుకు రూ.50 కోట్లకు పరువునష్టం వేశానని నారా లోకేశ్ తెలిపారు.
అయితే.. తాను ఏనాడు ఒక్క తప్పుడు పని చేయలేదు కాబట్టే వారు చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారని అన్నారు. సీఎం జగన్‌పై మేం ఆధారాలతో ఆరోపణలు చేశాం.. అందుకే జైలుకెళ్లారు. ఆ తర్వాత అక్రమ ఆస్తుల జప్తు కూడా జరిగిందని గుర్తు చేశారు. వివేకా హత్య కేసులోనూ అసత్యాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు నారా లోకేశ్. వివేకా హత్య కేసులో జగన్ పాత్రపైనా విచారణ సీబీఐ విచారణ జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక పాదయాత్రలో తాను వైసీపీ ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే టీడీపీ ప్రభుత్వమే అని.. అధికారంలోకి వచ్చాక సిట్ వేసి అంది సంగతి తేలుస్తామని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలపై నేను ఆరోపణలు చేస్తున్నా కదా.. వాటిపై విచారణ ఎదుర్కొనే దమ్ము ఎవరికైనా ఉందా అని లోకేశ్ సవాల్ విసిరారు.