డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 6:54 AM IST
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టి కొన్నింటిని అమలు చేస్తోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా.. బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు.. పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడుతోన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి లక్ష రూపాయల నుంచి రూ.5లక్షల వరకు రుణంగా అందించున్నట్లు తెలిసింది. డ్వాక్రా సంఘంలో ఒకే సమయంలో గరిష్టంగా ఇలాంటి రుణం ముగ్గురు తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాల కింద రూ.2వేల కోట్లు అందించాలని అధికారులు భావిస్తున్నారు. వీరిలో 1.35 లక్షల మందికి రూ.లక్ష.. 15వేల మందికి రూ.5లక్షల రుణాలను అందించాలని చూస్తున్నారు. అంతేకాదు.. లబ్ధిదారులకు మరింత ఆసక్తి ఉంటే.. యూనిట్ ఏర్పాటు వ్యయానికి తగిన విధంగా భవిష్యత్‌లో రూ.10 లక్షలకు కూడా పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర పథకాలైన పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీ దీనికి అనుసంధానించనున్నారు. అంతేకాదు ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నవారికి.. తీసుకున్న బ్యాంకు రుణంలో 35 శాతం రాయితీ కూడా వర్తిస్తుంది. అంటే రూ.లక్ష రుణం తీసుకుంటే రూ.35 వేలు రాయితీ కింద మినహాయింపు ఇస్తారు. రుణంలో మిగిలిప మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీగా వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఇటీవల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని తెలిపారు.