శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు

శ్రీశైలం పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో మరోసారి చిరుత కనిపించింది.

By Srikanth Gundamalla  Published on  31 Dec 2023 12:43 PM IST
Leopard, riot,  Srisailam, Devotees, panic,

 శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు

శ్రీశైలం పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో మరోసారి చిరుత కనిపించింది. దాంతో.. భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ ఔటర్‌ రింగ్‌ రోడ్డులో చిరుత పులి సంచరించింది. శనివారం రాత్రి రత్నానంద స్వామి ఆశ్రమం వద్ద ఉన్న హోమగుండం వద్ద గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అక్కడ నుంచి వెళ్తున్న భక్తులు చిరుత పులిని చూశారు. ఒక్కసారిగా భయాందోళన చెందారు. అయితే.. చిరుత పులిని చూసిన స్థానికులు వెంటనే తమతమ సెల్‌ఫోన్లు తీసి వీడియో, ఫొటోలు తీశారు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందన్న వార్త.. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వరుసగా సెలవులు ఉండటంతో భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ కూడా పెరిగింది. దాంతో.. అధికారుల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలంలో రోజురోజుకూ పులుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తరచూ చిరుతలు కనిపిస్తున్నాయనీ శ్రీశైల దేవస్థానానికి వెళ్తున్న భక్తులతో పాటు స్థానికులు కూడా ఫారెస్ట్‌ అధికారులకు చెబుతున్నారు. తమ ఫిర్యాదుల గురించి ఫారెస్ట్‌ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని భక్తులు, స్థానికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. రత్నానంద స్వామి ఆశ్రమం వద్ద చిరుత కనిపంచడంపై అధికారులు స్పందించారు. చిరుత పాదముద్రలను సేకరించారు. అయితే.. అంతకుముందు చిరుతపులి ఆవును చంపి తిన్నదని తెలిపారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండటం ముఖ్యమని అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా బయటకు రావొద్దని చెప్పారు. ఇక చిరుత అడుగుల ఆధారంగా ఎటువైపు వెళ్లిందనే దానిపై అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు తాజాగా భయాందోళనకు గురి చేసిన చిరుతను ఎలాగైనా పట్టుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. మూడునెలల క్రితం కూడా రుద్రాపార్క్‌ దగ్గర చిరుత కనిపించింది. మూడు నెలల వ్యవధిలోనే మరోసారి చిరుత కనిపంచడం కలకలం రేపుతోంది.

Next Story