Kurnool: అమ్మను చూడాలి.. జైలు గోడ వద్ద చిన్నారి ఏడుపు
తల్లి, బిడ్డల మధ్య అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 3:57 PM ISTKurnool: అమ్మను చూడాలి.. జైలు గోడ వద్ద చిన్నారి ఏడుపు
తల్లి, బిడ్డల మధ్య అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లి బిడ్డకోసం దేన్నైనా ఎదురిస్తే.. తల్లి కనబడకపోతే పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో మనం చూస్తూ ఉంటాం. ఓ చిన్నారి తల్లి కోసం జైలు గేటు వద్దకు వచ్చింది. తల్లి జైలుకి వెళ్లడంతో ఆ చిన్నారి ఇంకొక్కసారి అమ్మను చూస్తానంటూ ఏడుపు మొదలుపెట్టింది. అమ్మా అమ్మా అంటూ.. తల్లి కోసం కన్నీరుపెడుతూ అక్కడే గేటును పట్టుకుని వేచి చూస్తోంది. అమ్మతో మాట్లాడాలంటూ ఏడుస్తూనే ఆ చిన్నారి అంటోన్న మాటలతో స్థానికుల గుండె తరుక్కుపోయింది. తడారిన గొంతు ఆ పాపా పిలుస్తుంటే.. ఆ పాప కోరిక తీర్చలేక జైలు సిబ్బంది కూడా అయ్యో పాపం అనుకున్నారు.
ఈ సంఘటన కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్‌జైలు ఎదుట జరిగింది. పాతనగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పోలీసులకు పట్టుబడింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు..ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే ఆమెను మహిళా సబ్‌జైలులో ఉంచారు. అయితే.. తల్లి చేసిన నేరం చిన్నారికి తెలియదు. పాపకు తల్లి దూరం అయ్యిందనే బాధ మాత్రమే ఉంది. తల్లి చేసిన తప్పు గురించి ఆలోచించే వయసు కూడా ఆ బాలికకు లేదు. అమ్మ దూరం అయ్యిందనే ఆవేదనే పాపలో కనిపిస్తోంది. అదే బాధ జైలు వరకూ వచ్చేలా చేసింది.
పాప బాధ, ఆవేదనను చూడలేక కొందరు స్థానికులు జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ పాప తల్లిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక చిన్నారి బాధను గమనించిన జైలు అధికారులు కూడా దానికి ఒప్పుకున్నారు. చిన్నారిని జైలులో ఉన్న తల్లి వద్దకు తీసుకెళ్లి ఒకసారి కలిపించారు. తనివితీర తల్లిని చూసుకుని.. మాట్లాడిన తర్వాత జైలు అధికారులు ఆ చిన్నారిని మళ్లీ బయటకు పంపించారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు జైలు వద్దకు వెళ్లి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు.